Wednesday, February 7, 2007

నేనే లెజెండ్-2

అక్కడంతా కోలాహలంగా ఉంది. అది సినీమహోత్సవాల సందర్భంగా రిహార్సల్స్ జరుగుతున్న ఆడిటోరియం. పెద్ద పెద్ద తారలు చాలా ఓపిగ్గా స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నారు. యువవజ్రం బాలబాబు లాంటి మెగా హీరో కూడా అలుపన్నది లేకుండా గంట నుంచీ ప్రాక్టీస్ సెషన్లోనే ఉన్నారు. చిన్న వయసు హీరోయిన్లు కూడ ఆయనతో పోటీ పడలేక మాటి మాటికీ విరామం తీసుకుంటున్నారు. సినీమహోత్సవాల సందర్భంగా మేటి దర్శకుడు రాజేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలొ యువ దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో చిత్రపరిశ్రమలోని మేటి హీరో హీరోయిన్లందర్నీ పెట్టి ఒక ఉత్తేజకరమైన పాటని చిత్రీకరించాలని ఆర్గనైజింగ్ కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని అందరు హీరోలూ హీరోయిన్లూ ఆనందంగా స్వాగతించారు.

ఆడిటోరియంలో ఒక వైపు ఆ పాట చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. అక్కడ మేచోస్టార్ దర్శక రాజేంద్రునితో ఉత్సాహంగా ముచ్చటిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక అసిస్టెంట్ వారిని సమీపించి మేచోస్టార్ తో , "సార్ మీకోసం ఎవరో అభిమానులు వచ్చారు" అని చెప్పాడు నెమ్మదిగా. "ఓహ్ అలాగా, వాళ్ళని వెయిటింగ్ రూం లో కూర్చోబెట్టీ ఏమేంకావాలో అడిగి ఇప్పించు. ఒక అయిదు నిముషాల్లో షాట్ ముగించుకుని వస్తాను" అని చెప్పి, షాట్ కోసం చక చకా సెట్ మీదికి వెళ్ళారు. ఆరేడు నిముషాల్లో ఆయన వెయిటింగ్ రూం లోకి ప్రవేశించారు. "సారీ కొంచెం లేటయ్యింది. ఇప్పుడు చెప్పండి. ఎలా ఉన్నారు? ఎక్కడ నుంచి వచ్చారు?" అంటూ ప్రశ్నలతో ముంచెత్తుతున్న తమ అభిమాన హీరోని చూసి మాటలు రాక నిలబడి పోయారు వాళ్ళంతా. ఒకడు మాత్రం తేరుకుని "బాగున్నం సార్. మీరెట్లున్నరు సార్? చాన దూరం నుంచొచ్చినం సార్. మిమ్మల్ని కలుస్తమనే ఆశ గూడ లేకుండె. మిమ్మల్ని జూడగనే మాటల్ రాటం లేదు సార్.." అని అంటూండగనే ఆయన కల్పించుకుని "అప్పుడప్పుడూ షూటింగ్ పనుల్లో బిజీగా ఉండి అభిమానుల్ని కలవటానికి సమయం సరిపోదు అంతే. సరే మీరంతా ఏం చేస్తూ ఉంటారు?" అన్నారు.

వాళ్ళలో చాలా మంది స్టూడెంట్స్. కొందరు ఉద్యోగాలు చేసేవాళ్ళూ ఉన్నారు. మేచోస్టార్ అభిమాన సంఘాలు పలు సందర్భాల్లో రాష్ట్రమంతటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. తమ అభిమాన హీరో నిర్వహించే 'బ్లడ్ బ్యాంక్' మరియు 'ఐ బ్యాంక్' లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ ఉంటారు. రాష్ట్ర సినీ చరిత్రలో ఇటువంటి కార్యక్రమాల్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన సినీ హీరో లేనే లేడు. మహా నటుడు, మహా నేత, విశ్వ విఖ్యాత నట చక్రవర్తి తరువాత ఇంత ప్రజాదరణ పొందిన నటుడు కూడా లేనే లేడు. అందుకే ఆయన్ని చాలామంది "లివింగ్ లెజెండ్"గా పరిగణిస్తారు. అభిమానులైతే ఏకంగా దైవంతో సమానంగా చూస్తారు. అవును మరి, సినీ హీరో అభిమానులమని చెబితేనే జనం ఒక రకంగా చూసే స్థాయి నుంచి, మేచో స్టార్ ఫ్యాన్స్ అంటె అభిమానంగా, ఒకింత గౌరవంగా కూడా పలకరించే స్థాయికి తీసుకు వచ్చిన ఘనత మేచోస్టార్ కే దక్కుతుంది.

అభిమానుల్తో మాట్లాడుతుండగానే స్టార్ ప్రొడ్యూసర్ రాగానాయుడు గారు వచ్చి "కొంచెం ఇలా రాగలరా" అన్నట్టు దూరం నుంచి సైగ చేశారు. చిరునవ్వుల్తో అభిమానుల్ని సాగనంపి వచ్చారు మేచోస్టార్. "మీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రండి" అంటూ గదిలోకి తీసుకెళ్ళారాయన. అక్కడ సినీమహోత్సవ ఆర్గనైజింగ్ కమిటీ మొత్తం కూర్చుని ఉంది. అందరూ ఆందోళనగా ఉండటం గమనించి "ఏమైంద"న్నట్లు కనుబొమ్మలెగరేశారు మేచోస్టార్. "ఏముంది, ఎప్పుడూ ఉండే సంతే. ఆ జోకర్ బాబు సన్మానం గురించి. ఇప్పటికే సినీమహోత్సవ ముగింపు పాటలో నటించమని ఆహ్వానించటానికి ఫోన్ చేస్తే నన్ను బండ బూతులు తిట్టాడు. కారణం కూడా చెప్పలేదు. ఇప్పుడు ఆయన సన్మానం గురించే అందరి భయమూ. గడసరి గారి పుణ్యమా అని ఇప్పుడీ కమలశ్రీ బిరుదు కూడా వచ్చింది కదా. అసలు మొన్ననే నన్ను లెజెండ్ గా గుర్తించి సన్మానం చేస్తేనే ఫంక్షన్ కైనా వస్తానని అటకెక్కాడు. అక్కడికీ చెప్పా. నిన్ను లెజెండ్ గా సన్మానిస్తే జనాలు మమ్మల్ని ఎగరేసి తంతారూ అని. ఒప్పుకుంటాడా దరిద్రుడు!! ఇప్పుడు కనీసం ముఖ్య మంత్రి గారితోనైనా సన్మానం జరిపించకపోతే మళ్ళీ బయట ఏ ప్రెస్ కాన్‌ఫరెన్సో పెట్టి అడ్డమైన మాటలూ మాట్లాడతాడు. అరచంద్ గారేమో మీకు లెజెండ్రీ పురస్కారం ఇవ్వాలనుకోవటమే జోకర్ బాబు అలుకకు కారణం కాబట్టి అది ఆపేద్దాం అంటున్నారు.మిగతా కమిటీ మొత్తం ఇవ్వాల్సిందే అని పట్టుబడుతోంది. మీకో మాట చెబుదామని నేనే పిలిపించాను" అన్నాడు కమిటీ కన్వీనర్ ఎ.యస్.రాజారావు. "అదేంటండీ!! నాకు లెజెండరీ పురస్కారమా? అంత పెద్ద పెద్ద వారుండగా నాకా? బాగుండదండీ. అరచంద్ గారన్నది నిజమే" అంటుండగా మధ్యలోనే రాగానాయుడు గారు కల్పించుకొని "వారంటున్నది కరక్టే. నువ్వు అందుకు అన్ని విధాలా విధాలా అర్హుడివి. మరేం మాట్లాడకు. గడసరి గారు కూడా పదే పదే చెప్పారు. వాడి సంగతేదో ఆయనే మానేజ్ చేసుకుంటామన్నారు" అని రకరకాలుగా సర్ది చెప్పారు. మిగతా కమిటీ అంతా పదే పదే అదే చెప్పేసరికి మేచోస్టార్ "అలాగేనండీ మీ ఇష్టం. నాకు మాత్రం ఇది పూర్తిగా అంగీకారం కాదు" అంటూ ఏదో ఆలోచిస్తూ బయటికి నడిచారు.
(ఇంకా ఉంది)
*****************************************************************************

8 comments:

Valluri Sudhakar said...

మీ ప్యారడి బాగుంది. కథ రసకందాయంలొ పడింది. వదలండి మరో భాగాన్ని.

రానారె said...

పేర్లన్నీ హైలైట్. ఆనంద్ ఎవరో మాత్రం అందడంలేదు.

Harsha said...

ఎ.ఆనంద్ గారు మేచోస్టార్ గారి బావ మరిది, ప్రాణ స్నేహితుడూను. కమలశ్రీ ఎ.నాగలింగయ్య గారి అబ్బాయి. దొడ్డ నిర్మాత. వారి పరిచయం వచ్చే భాగంలో చేయనున్నాను. హదన్నమాట.

Winner said...

ఆనంద్ అంటే నాకూ అందలేదు, హర్షగారి వివరణ చూసేవరకూ., ఆనంద్ బదులుగా అరచంద్ క్యాచీగా వుండేది (చిల్లు అరచంద్ అంటే మరింతగా). బాగా రాస్తున్నారు. అభినందనలు.

Unknown said...

ప్రసాదంగారూ, మీకు మీరే సాటి. అరచంద్ అనగా సగంచంద్రుడని అర్థం. అసలే సగం చంద్రుడు ఆపైన దానికో చిల్లు.

Harsha said...

సూపరండీ ప్రసాదం గారూ. నేను ముందర పేర్లన్నీ ఆలోచించి పెట్టుకున్నప్పుడు సరిగ్గా 'అరచంద్ ' అనే ఫిక్సయ్యాను. కానీ నోట్ చేసుకోకపోవడంతో రాసేటప్పుడు అస్సలు గుర్తుకు రాలేదు. మీరన్నది నిజమే. ఆ పేరే చాలా కాచీ గా ఉంది. మీరు సజెస్ట్ చేసినట్టుగా అదే పేరు వాడతాను. చాలా కృతఙతలు.

Unknown said...

చాలా బాగా రాస్తున్నారు... మూడో భాగం కోసం వెయిటింగ్.

Raghuram Murthy said...

నాకు నచ్చలేదు. looks like completely biased.