Thursday, February 1, 2007

నేనే లెజెండ్

తెలవారింది. అలవాటుగా అమ్మనా బూతులు తిడుతూ నిద్ర లేచాడు జోకర్ బాబు. అతని అసలు పేరు 'సప్తశలభమో','సుప్తకంకాళమో' అని... ఏదో అలాంటిదే. సినిమాల్లో చేరిన కొత్తలో ఆ పేరు విని జనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటుంటే చూడలేక ఆయన గురువుగారు శ్రీ గడసరి పద్మనాభరావు గారు 'జోకర్ బాబు' అని నామకరణం చేశారు. తరువాతి కాలంలో, తాను జోకులెయ్యక పోయినా తనే ఒక జోకుగా మారి సార్థక నామధేయుడయ్యాడు. మనోడికి కోపం ముక్కు మీదనే ఉంటుంది. ముక్కు కూడా బాగా పొడుగ్గానే ఉంటుంది. "నేను ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటా"నని అందరి ముందూ డబ్బా కొడుతుంటాడు కూడా. ఊరికే చిరాకు పడిపోవటం, ఎదురొచ్చిన ప్రతి వాడి మీదా ఒంటి కాలిపై లేవటం అతనికి అతి సహజమైన అలవాట్లు.

ఈ రోజు ఇంత ఉదయాన్నే తననెవరో నిద్రలేపటంతో విపరీతమైన కోపంతో లేచాడు. ఎదురుగా పెద్ద కొడుకు కిష్టు బాబు. "ఏంట్రా"? అని అరిచాడు. "నాన్నా అదీ..." అంటూ నసిగాడు భయంగా. "తొందరగా చెప్పి చావు",కసిరాడు జోకర్ బాబు. ఎందుకైనా మంచిదని ఒక రెండడుగులు వెనక్కి జరిగాడు కిష్టు. "అదీ.. మీకు ప్రభుత్వం కమలశ్రీ అవార్డు ఇచ్చింది", అని చేతిలోని న్యూస్ పేపర్ చూపించాడు.

సడెన్ గా గుర్తుకు వచ్చింది జోకర్ బాబుకి, గురువుగారు నిన్ననే తనతో ఫోన్లో మాట్లాడిన విషయం. "అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్నమాట". ఆనందంతో కిసుక్కుమని నవ్వుకున్నాడు. ఆ నవ్వు చూడగానే కొంచెం ధైర్యం వచ్చింది కిష్టుకి. "వాల్లెవరో ఉదయం నుంచీ వెయిట్ చేస్తన్నారు. పూలూ, పల్లూ తెచ్చారు" అన్నాడు ముద్దముద్దగా.

"అయితే మాత్రం, ఇంత ఉదయాన్నే నిద్ర లేపుతావా, నాలుక మందం వెధవా..." అంటూ మళ్ళీ లంకించుకుంటుండగానే పెడసరంగా వినిపించిందొక గొంతు,"ఇప్పుడు తొమ్మిదయ్యింది. క్రమశిక్షణ పేరుతో మాకు వాయగొట్టడం కాదు. నువ్వూ కొంచెం నేర్చుకో".

ఆ గొంతు చిన్న కొడుకు కనోజ్ ది. వాడికి వయసు తక్కువైనా "మొరిగే కుక్కలు కరవవని" బాగా తెలుసు. అందుకే తండ్రి గ్రామసిం హగర్జనలకి పెద్దగా భయపడడు. పైగా ఒక్కోసారి కిందా మీదా పడి నవ్వుతాడు కూడా. అందుకే వాడంటే జోకర్ బాబుకి లోలోపల చాలా భయం. కానీ వాడి దగ్గిర కూడా అప్పుడప్పుడూ లేనిపోని డంబం ప్రదర్శిస్తూ ఉంటాడు. అందుకే, " రేయ్ నీకు బొత్తిగా క్రమశిక్షణ.." అంటూ ఏదో అనబోయి, మళ్ళీ వాడు నోరు తెరిచాడంటే కింద హాల్లో ఉన్నవాళ్ళ దగ్గిర తన ఇమేజి దెబ్బ తింటుందన్న విషయం గ్రహించి నోరు మూసుకున్నాడు. వాడి గొంతు వినిపించినవైపు గుడ్లురిమి చూశాడు. అప్పటికే అక్కడినుంచి వెళ్ళిపోయాడు కనోజ్.

పట్టరాని ఉక్రోషంతో మంచం మీది నుంచి లేచి విసురుగా కిష్టు చేతిలోని పేపర్ లాక్కుని చర చరా బెడ్ రూంలోంచి బయటకు నడుస్తుండగా పూజ గదిలోంచి హారతి పళ్ళెంతో నవ్వుతూ ఎదురొచ్చింది శ్రీమతి. " హారతి తీసుకోండి " అంటూ పళ్ళెం ముందుకు చాచింది. పిచ్చి కోపమొచ్చింది జోకర్ బాబుకి. ఎడంచేత్తో విసురుగా పళ్ళేన్ని ఎగరగొట్టాడు. అది స్లో మోషన్ లో గింగిరాలు తిరుగుతూ కింద హాల్లో ఉన్న అనుచరగణం మధ్యలో ల్యాండ్ అయ్యింది. వాళ్ళు అదిరిపడి సోఫాల్లో ఎగిరెగిరి పడ్డారు. " ఏమైందండీ?", అని భయంతో కొద్దిగా హెచ్చు స్వరంతోనే అడిగిందావిడ. మరుక్షణంలో ఆమె చెంప ఛ్హెళ్ళుమంది.

ఆడవాళ్ళెవరైనా తనముందు కొంచెం గట్టిగా మాట్లాడితే అస్సలు నచ్చదు జోకర్ బాబుకి. అలా మాట్లాడ్డం ద్వారా వాళ్ళు పదిమందిలో చులకన అయిపోతారని అతని భావం. అలాంటి సమయాల్లో వాళ్ళ గౌరవం నిలబెట్టడానికి ఇలా శాయశక్తులా కృషి చేస్తుంటాడు. గతంలో తన సొంత సినిమా 'ఎదరాయుడు ' షూటింగ్ లో ఇలాగే ఒకసారి తనను ఏదో విషయమై నిలదీసి అడిగిందని సీనియర్ నటి వాసంతి చెంప చ్హెళ్ళుమనిపించాడు . అప్పట్లో అదొక పెద్ద ఇష్యూ అయ్యింది కూడా. అలాగే కిష్టు సినిమాలో పరిచయం చేసిన యువ హీరోయిన్ పరువు కూడా పదిమందిలో ఒకసారి కాపాడాడు.

ఇప్పుడు తన భార్య పరువు కాపాడ్డమే కాకుండా కిందున్న అనుచరగణాన్ని కూడ భయపెట్టగలిగాడు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నమాట.


" ఏంటే?? నాకింత అవమానం జరిగితే నువ్వు ఇకిలిస్తూ హారతి తెచ్చావ్? నువ్వు కూడా ఆ మేచోస్టార్ అభిమాన సంఘంలో చేరిపొయ్యావా?" గద్దించాడు. "అవార్డు రావటం అవమానమేంటి? దీనికీ మేచోస్టార్ కీ సంబంధమేంటీ?" అని అడగలేదామె. విషయం అర్థమయ్యిందామెకి. "నిన్నటిదాకా గురువు గారిని శతపోరి ఈ అవార్డు ఇప్పించుకున్నాడు, ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అని చూస్తున్నడన్నమాట ముదనష్టపోడు " అనుకుందామె.

"మొన్నటికి మొన్న ఆ మేచోస్టార్ కి కమల భూషణ్ అవార్డు నిచ్చి నాకు మాత్రం కమలశ్రీ ఇస్తారా?" గర్జించాడు జె.బి.

అనుచరగణం ఒఖ్ఖ ఉదుటున తాము తెచ్చిన పూలూ పళ్ళూ దండలూ సోఫాల కిందకి తొసేశారు. ముఖాల్లో నవ్వుల్ని మాయం చేసి తలా ఒక గరిటెడు బాధ నింపుకున్నారు. జె.బి.విస విసా మెట్లు దిగి వచ్చేలోపే ఎవరికి వాళ్ళు కొత్త కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకున్నారు. పాపం ఈ గణమంతా ఈయనగారి కొత్త ప్రొడక్షన్ లో పని చేస్తున్నారు. వీళ్ళలో చాలా మందికి ఈ కొత్త సినిమాయే మొదటి అవకాశం. సీనియర్ టెక్నీషియన్లు జోకర్ బాబుతో పని చెయ్యటం ఎప్పుడో మానేశారు. అందుకే ఇలా కొత్త వాళ్ళకు ఛాన్సులిచ్చి వాళ్ళతో తన అనుచరగణంలో ఖాళీలు నింపుకుంటుంటాడు జె.బి. ఆ విధంగా ఎప్పటికప్పుడు ఒక నలుగురిని తన చుట్టూ తిప్పుకోగలుగుతుంటాడు.

" ఏంటయ్యా ఇలా వచ్చారు?" నవ్వుతూ వాళ్ళని సమీపించి చాలా కాజువల్ గా అడిగాడు. ఎప్పుడూ తనని 'పనికి మాలినోడా', 'చెత్త నా @@@@' అని తప్ప ఇంత గౌరవంగా పిలవని ప్రొడ్యూసర్ గారు అలా మర్యాదగా మాట్లాడేటప్పటికి గిర్రున కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఒక కుర్ర అసిస్టెంట్ డైరెక్టర్ కి. "స్సార్ హ్హెంత ఘోరం ఝరిగి పోయింది స్సార్? మీఖు హట్లాంటి హవార్డు ఇయ్యడమేంది స్సాహ్ ర్ ర్" అని భోరుమంటూ ఇందాకే తయారు చేసుకున్న కొత్త స్క్రిప్ట్ చదివడం మొదలు పెట్టాడు. కానీ ఆ ఎమోషన్ లో, ప్రొడ్యూసర్ గారి మొహం లో రంగులు మారుతుండటం పసిగట్టలేకపోయాడు. (ఇంకా ఉంది)

**********************************************************************************

11 comments:

రానారె said...

"ప్రభుత్వమే అవార్డిచ్చాక ప్రజలెంత" హహ్హహ్హ!!
ఆదివారం ఆంద్రజ్యోతిలో "సరదాగా..." రాసే రాజగోపాల్ వ్యంగ్యాన్ని మించిపోయింది. కంటిన్యూ మాడి.

శ్రీనివాస said...

బ్లాగుంది :)
కానివ్వండి... కానివ్వండి...

మంజుల said...

:)))

రాజు సైకం said...

మొదటి.. పోస్ట్ తోనే... అదర గొట్టేసారు...
కానివ్వండీ..

Rajendra said...

మాస్టారు వ్యంగ్యం అదిరింది. ఇంక ఇరగదీయండి.

Vissu said...

narration bavundi. kaaka pothe ide first time aa blog rayadam.. kothadi okati start chesavu?

chaala bad taste lo vundi personal life ni attack chestu.

Anonymous said...
This comment has been removed by the author.
రాధిక said...

names bhale vunnaayi.twraga taruvati part kudaa post cheyandi.

Harsha said...

అందరికీ కృతఙతలు.

తెలుగులో (అందునా 'బ్లాగ్ స్పాట్'లో)పబ్లిష్ చేసిన నా మొదటి పోస్ట్ ఇదే. బ్లాగ్ రాయటం మాత్రం ఇదే మొదటి సారి కాదు. విషయం ఏక పక్షంగా ఆలోచించి రాశాననిపిస్తే అది నిజమే. మేచోస్టార్ అభిమానిని మరి. అదే కాక జోకర్ బాబుని దగ్గరనుంచి గమనించిన నా స్నేహితులు కొందరు గతంలో చెప్పిన విషయాలనే ప్రాతిపదికగా తీసుకొన్నా. అదన్నమాట. "కొత్త బిచ్చగాడు పొద్దెరగడు" అన్నట్లు నాక్కూడా ఉబలాటంగానే ఉంది రాయాలని. కాని అనుభవ రాహిత్యం వల్ల కొంత సమయం పడుతోంది.సాధ్యమయినంత తొందర్లోనే ముగించటానికి ప్రయత్నిస్తాను.

calyen said...

బావుంది, సూపర్ !
/me looking forward for (ఇంకా ఉంది) !

ఉదయ్ భాస్కర్ said...

హర్ష గారు, చాల బాగా రాస్తున్నారు. మీ గురించి తెలుగుబ్లాగు గుంపులొ మీ స్నెహితుడు పరిచయం చెసినప్పుడే అనుకున్న, మీ బ్లాగు బాగుంటాది అని.
విజయొస్తు..మరి తరువాయి బాగం కూడ త్వరగ పొస్టు చెయ్యండి.